- 293 అసెంబ్లీ సీట్లకుగాను 207 చోట్ల గెలుపు
- మ్యాజిక్ ఫిగర్ 148 కంటే 59 సీట్లు ఎక్కువే కైవసం
- చరిత్రాత్మక విజయంతో రాష్ట్రంలో తొలిసారి పవర్లోకి బీజేపీ
- 15 ఏండ్ల మమత పాలనకు తెర..
- భవానీపూర్‌లో సువేందు చేతిలో ఓడిన మమత
కోల్ కతా:పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కమాల్ చేసింది. రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. బంపర్ మెజార్టీతో గెలిచి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ సర్కారు15 ఏండ్ల పాలనకు చరమగీతం పాడింది. దీదీ కంచుకోటగా మారిన బెంగాల్ లో చరిత్రాత్మక విజయంతో తొలిసారి పాగా వేసింది.
వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలన్న మమత ఆశలకు గండికొట్టింది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 294 నియోజకవర్గాలకు గత నెల 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించిన ఈసీ.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టింది.
తీవ్రమైన ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియ అణచివేత వంటి కారణాలను చూపుతూ, ఫాల్తా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో ఈ నెల 21న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆ నియోజకవర్గం మినహా మిగతా 293 సీట్లకు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించింది.
మొత్తం 294 సీట్లకుగాను బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెలిచి విజయదుందుభి మోగించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ (మ్యాజిక్ ఫిగర్) 148 సీట్లను సునాయాసంగా దాటిన కమలం పార్టీ.. రెండింట మూడొంతుల సీట్ల(196) మార్కును సైతం దాటి కమాల్ చేసింది. మమత నేతృత్వంలోని టీఎంసీ బీజేపీ హవాతో ఈసారి 80 సీట్లకే పరిమితమైపోయింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 2, ఏజేయూపీ 2, సీపీఎం 1, ఏఐఎస్ఎఫ్ పార్టీ 1 సీటు చొప్పున గెలుచుకున్నాయి.
బీజేపీ అత్యధికంగా 45.83% వోట్ షేర్ సాధించగా, టీఎంసీ 40.81% ఓట్లు దక్కించుకుంది. కాగా, ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది మొదటి దశలో 93.16%, రెండో దశలో 91% పోలింగ్ జరిగింది.
రాష్ట్రవ్యాప్త సగటు ఓటింగ్ 92% కంటే ఎక్కువగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక ఓటింగ్ శాతంగా నిలిచింది. దీంతో రికార్డ్ స్థాయిలో పెరిగిన ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగానే ఉంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. దాదాపుగా అంతకుమించిన ఫలితాలు వచ్చాయి.
అన్ని డివిజన్లలోనూ కమల వికాసం
పశ్చిమ బెంగాల్ లో మొత్తం 23 జిల్లాలు ఉండగా, అవి బుర్ద్వాన్, జల్పాయ్ గురి, మాల్దా, మేదినీపూర్, ప్రెసిడెన్సీ అనే ఐదు అడ్మినిస్ట్రేషన్ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. అయితే, ఒక్కటి మినహా అన్ని డివిజన్లలోనూ బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుని సత్తా చాటింది.
బుర్ద్వాన్ ప్రాంతంలో 54 సీట్లకుగాను బీజేపీ 45 సీట్లు గెలవగా, టీఎంసీ 9 సీట్లకు పరిమితమైంది. జల్పాయ్ గురిలో 27 సీట్లు ఉండగా, బీజేపీ మొత్తం సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.
మాల్దాలో 49 సీట్లు ఉండగా బీజేపీ 21 సీట్లు గెలిచింది. టీఎంసీ 23 సీట్లు, కాంగ్రెస్ 2, లెఫ్ట్ 1, ఇతరులు 2 చొప్పున సీట్లు గెలిచారు. ఇక మేదినీపూర్ లో 56 సీట్లకుగాను బీజేపీ 52, టీఎంసీ 4 సీట్లు గెలిచాయి. అలాగే ప్రెసిడెన్సీ ఏరియాలో 108 సీట్లు ఉండగా, బీజేపీ 58, టీఎంసీ 48, లెఫ్ట్ 1 సీటు గెలిచాయి. అధికార తృణమూల్ కోల్ కతాతోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది.
మమత నివాసం వద్ద భద్రత పెంపు
కోల్ కతా కాళీఘాట్‌లోని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద సోమవారం మధ్యాహ్నం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె ఇంటి సమీపంలోకి ఒక బృందం చేరుకుని "జై శ్రీరామ్" నినాదాలు చేయడంతో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. రాష్ట్ర సచివాలయం 'నబన్న' వద్ద కూడా భద్రతను పెంచామని ఆయన చెప్పారు. "మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం, రాష్ట్ర సచివాలయం వద్ద కేంద్ర బలగాలను మోహరించాం.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా భద్రతను పటిష్టం చేశాం" అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో సోమవారం విక్టరీ ర్యాలీలు నిర్వహించడానికి ఏ రాజకీయ పార్టీని అనుమతించవద్దని పోలీసులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విక్టరీ ర్యాలీలన్నింటికీ మంగళవారం అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.
దీదీకి ఓటమి.. సువేందుకు డబుల్ విక్టరీ
బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఓడిపోయారు. కోల్‌కతా జిల్లా భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజ యం చెందారు. మొత్తం 20 రౌండ్ల కౌంటింగ్‌లో మొదటి రౌండ్ నుంచీ ఆధిక్యంలో కొనసాగిన మమతకు.. క్రమంగా ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేకొద్దీ ఆధిక్యం తగ్గిపోతూ రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ పెరిగిపోయింది.
చివరకు 16వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మమత కంటే సువేందు 554 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. తర్వాత 18వ రౌండ్ పూర్తయ్యేసరికి సువేందు మొత్తం 67,239 ఓట్లతో 10,994 ఓట్ల లీడింగ్ సాధించారు.
మమత 56,245 ఓట్లతో వెనకంజలో నిలిచారు. తర్వాత చివరిదైన 20వ రౌండ్ పూర్తయ్యేసరికి మమత 58,812 ఓట్లు సాధించారు. సువేందు 73,917 ఓట్లు సాధించి, మమతపై 15,105 ఓట్ల మెజార్టీతో గెలుపొందా రు. ఈ ఎన్నికల్లో మమత భవానీపూర్ నుంచి మాత్రమే పోటీ చేశారు.
భవానీపూర్ తన కంచుకోట అని, చివరికి ఒక్క ఓటుతోనైనా గెలు స్తానని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 15 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓటమిపాలయ్యా రు. కాగా, సువేందు ఇటు భవానీపూర్ తోపాటు అటు నందిగ్రామ్ లోనూ బరిలోకి దిగారు.
నందిగ్రామ్‌లో మొత్తం 1,27,301 ఓట్లు సాధించిన సువేందు.. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్‌పై 9,665 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2021 ఎన్నికల్లో మమత నందిగ్రామ్‌లో పోటీ చేయగా, అప్పుడు అక్కడ కూడా సువేందు అధికారే ఆమెను ఓడించారు.
